ఆగస్టు 10 జైల్ భరోను జయప్రదం చేయాలి: సీఐటీయూ.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 02 (తెలంగాణ ముచ్చట్లు):
ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పిలుపునిచ్చారు.
ఆదివారం సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు డిస్కంను రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, విదేశీ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం దేశభక్తి పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ, కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యం కల్పిస్తోందని విమర్శించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల భారత రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, అలాగే నాలుగు లేబర్ కోడ్‌ల అమలుతో కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.
ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి, రాష్ట్రాలపై అదనపు భారం మోపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టి ప్రజలను చైతన్యపరుస్తామని, ప్రభుత్వం విధానాలను మార్చుకోకపోతే అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ జక్కుల రమేష్ యాదవ్, మండల నాయకులు కన్నం సదానందం, గడ్డం శోభన్, ఇల్లందుల సమ్మయ్య, పోచయ్య, కిరణ్, సంతోష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments