వానలతో రైతన్నలో మళ్లీ చిగురించిన ఆశలు.
వర్షాలతో పొలాల బాట పట్టిన అన్నదాతలు.
హుజురాబాద్ , జూలై 30 (తెలంగాణ ముచ్చట్లు):
ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో రైతన్నలో మళ్లీ ఆశలు చిగురించాయి. జూన్, జూలై నెలలుగా వర్షాల కోసం ఎదురుచూస్తూ ఆందోళనలో ఉన్న రైతులకు మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి వర్షాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. వర్షాలు సమృద్ధిగా కురవడంతో నేల తడిసి సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో రైతులు పొలాల బాట పట్టారు.
ఈ ఖరీఫ్ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగు ఆలస్యమైంది. విత్తనాలు సిద్ధంగా ఉంచుకున్న రైతులు వర్షాభావం కారణంగా సాగు ప్రారంభించలేక తీవ్ర నిరాశకు గురయ్యారు. కొంతమంది రైతులు ఇప్పటికే దున్నిన పొలాలు కూడా ఎండిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వర్షాలు రాత్రంతా కొనసాగడంతో పరిస్థితి పూర్తిగా మారింది. పొలాల్లో తగినంత తేమ ఏర్పడటంతో రైతులు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలతో తెల్లవారుజామునే పొలాల్లోకి వెళ్లి విత్తనాలు వేసే పనులను ప్రారంభించారు. వరి, మొక్కజొన్న, పత్తి సాగు పనులు వేగం పుంజుకోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగితే ఖరీఫ్ సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పంటలు కూడా ఆశించిన మేర దిగుబడులు ఇస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరుణుడి కరుణతో ఈ సీజన్‌లో మంచి పంటలు పండాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.


Comments