అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి.
- *దశలవారీగా ప్రతీ కుటుంబానికి మంజూరు*
- *రూ.21వేల కోట్లతో రైతన్నపై రుణభారం తగ్గించాం*
- *కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం*
- *ఖమ్మం రూరల్ మండలంలో రూ.7.21 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన*
ఖమ్మం బ్యూరో, జులై 29(తెలంగాణ ముచ్చట్లు )
ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటనూ తూచా తప్పకుండా అమలు చేస్తుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ ముందుకు సాగుతోందన్నారు.
బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఖమ్మం రూరల్ మండల పరిధిలో రూ.7.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. డాక్యా తండాలో రూ.1.41 కోట్లతో మంగళగూడెం–డాక్యా తండా రోడ్డు, పల్లెగూడెంలో రూ.5.80 కోట్లతో గొల్లగూడెం నుంచి ఎన్.ఎస్.పీ. మీదుగా పల్లెగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అన్నారు. రైతు భరోసా ద్వారా ప్రతి ఎకరానికి రూ.6 వేల చొప్పున కేవలం 9 రోజుల్లోనే రూ.9,200 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రూ.2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ ద్వారా 25 లక్షల మంది రైతులకు రూ.21,000 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గించామని వివరించారు. సన్న వరిధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు.
- *నాలుగు విడతల్లో :* నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తొలి విడతలో 4.50 లక్షలు, రెండో విడతలో 2.50 లక్షలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 7 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. రెండో విడతలో మిగిలిన గ్రామాలకు త్వరలోనే ఇళ్లు మంజూరు చేస్తామని, రాబోయే మూడో, నాలుగో విడతల్లో అర్హులైన ప్రతీ కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.
- *మహిళా సాధికారతే ధ్యేయం :* రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని, కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. గ్రామీణ రహదారులు, విద్యాసంస్థలు, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, ఖమ్మం ఆర్‌డీవో ఎన్.శ్రీనివాస్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, పీఆర్ ఈఈ మహేష్‌బాబు, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Comments