వరద ముప్పుపై అప్రమత్తం.. రంగంలోకి దిగిన మున్సిపల్ చైర్మన్.
జమ్మికుంట టౌన్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో స్వల్ప వర్షానికే నీటిమునిగే ప్రాంతాల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ చర్యలు వేగవంతం చేశారు. బుధవారం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీతో పాటు హుజూరాబాద్ రహదారి నుంచి వచ్చే వర్షపు నీరు శ్రీరామ హాస్పిటల్ ప్రాంతంలో నిలిచిపోతున్న పరిస్థితిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
డ్రైనేజీ కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర చెత్తాచెదారం పేరుకుపోవడంతో వర్షపు నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు గుర్తించిన చైర్మన్, మున్సిపల్ జేసీబీ యంత్రంతో ప్రత్యేకంగా డ్రైన్లను శుభ్రం చేయిస్తూ పనులను స్వయంగా పర్యవేక్షించారు.
వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే పనులు కొనసాగుతాయని చైర్మన్ తెలిపారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను డ్రైన్లలో వేయకుండా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీపతి నరేష్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Comments