పీఆర్సీ, డీఏల విడుదలలో జాప్యం.. ప్రభుత్వంపై డీటీఎఫ్ ఆగ్రహం.
ఇల్లందకుంట, జూలై 28 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా పీఆర్సీ అమలు కాకపోవడం, ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇల్లందకుంట మండలంలో నిర్వహించిన డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే తెప్పించి అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరింత ఆలస్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా డీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ, ఆరోగ్య బీమా పథకం కోసం మే నెల నుంచి ఉద్యోగుల వేతనాల నుంచి ప్రీమియం మినహాయింపులు చేస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు ప్రకటించకపోవడం విచారకరమన్నారు. ఉద్యోగులకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందేలా స్పష్టమైన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ప్రాథమిక పాఠశాలలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న జీవో–25ను సవరించి, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం డీటీఎఫ్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి తూముల తిరుపతి మాట్లాడుతూ, టెట్ కేవలం ఉపాధ్యాయ అర్హత పరీక్ష మాత్రమేనని, అందువల్ల అర్హత మార్కులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అభ్యర్థులందరికీ ఒకే విధంగా నిర్ణయించాలని కోరారు. అలాగే అభ్యర్థులకు వారు అభ్యసించిన సంబంధిత సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఏబూసి శ్రీనివాస్, ఇల్లందకుంట మండల అధ్యక్షుడు సార్ల సంపత్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ వేణు, ఎం. సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments