ఛలో పార్లమెంట్‌కు మద్దతుగా హుజూరాబాద్‌లో పోస్టర్ ఆవిష్కరణ.

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్.

ఛలో పార్లమెంట్‌కు మద్దతుగా హుజూరాబాద్‌లో పోస్టర్ ఆవిష్కరణ.

హుజూరాబాద్, జూలై 24(తెలంగాణ ముచ్చట్లు ):

కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించే 'ఛలో పార్లమెంట్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు పిలుపునిచ్చారు. శుక్రవారం హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు, వివిధ ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఛలో పార్లమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌లను పునరుద్ధరించడం, జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావడం, రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం అమలు, జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు పూర్తి చట్టబద్ధత కల్పించడం వంటి ప్రధాన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
బీసీ జేఏసీ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ నెల 27న ఢిల్లీలో జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు సౌడమల్ల యోహాన్, ప్రజా ప్రతిభ జిల్లా బ్యూరో ఇప్పకాయల సాగర్, రాఘవుల శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, శంకర్, రవీందర్, మధు, కొండ గణేష్, సందేల వెంకన్న, కొలిపాక క్రాంతికుమార్, మామునూరి ప్రవీణ్ కుమార్, సంగం సత్యనారాయణ, సొల్లు శంకర్, కొక్కుల రవీందర్, ఆర్‌ఎంపీ పిట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News