సకల సౌకర్యాలతో మండల కార్యాలయాల సముదాయం నిర్మాణానికి ప్రణాళికలు...
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.
ఖమ్మం బ్యూరో, జూలై 22(తెలంగాణ ముచ్చట్లు )
ప్రజలకు అందుబాటులో ఒకే ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ శాఖలు, సకల సౌకర్యాలతో మండల కార్యాలయాల సముదాయ భవన నిర్మాణానికి ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.
కల్లూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు బుధవారం అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి నూతనంగా నిర్మించనున్న సమీకృత మండల కార్యాలయ సముదాయ నిర్మాణం పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
సమీకృత మండల కార్యాలయ సముదాయ భవనాల నిర్మాణ మ్యాప్ లను పరిశీలించిన కలెక్టర్ ఆర్ అండ్ బీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ కల్లూరు మండల స్థాయిలో ప్రజల సౌకర్యార్థం అన్ని కార్యాలయాలు ఒకే చోట అన్ని వసతులతో ఉండే విధంగా నిర్మించాలని, దీనికి తగిన విధంగా ప్రణాళికలు, భవనాలు, కావాలసిన వసతుల డిజైన్ తయారు చేయాలని అన్నారు.
మండల స్థాయిలో రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్, విద్యాశాఖ, శిశు సంక్షేమం, రిజిస్ట్రేషన్, రోడ్లు & భవనాలు, నీటిపారుదల, మిషన్ భగీరథ తదితర శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో పనిచేయనున్నాయి. దీంతో ప్రజలు ఒక పని కోసం పలుచోట్ల తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని ప్రభుత్వ సేవలను ఒకేచోట పొందే అవకాశం కలుగుతుందన్నారు.
అంతస్తుల వారీగా కార్యాలయాల ఏర్పాటు చేసి విశాలమైన కాన్ఫరెన్స్ హాల్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, విశాలమైన సమావేశ మందిరాలు, ఆధునిక కార్యాలయ గదులు, ప్రజల కోసం వేచిచూడే హాల్స్, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, దివ్యాంగులకు అనుకూల ర్యాంపులు, లిఫ్ట్ తదితర ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో పనిచేయడం వల్ల ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయం మెరుగుపడి, ఫైళ్ల పరిష్కారం వేగవంతం కానుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సమీకృత మండల కార్యాలయ సముదాయం నిర్మాణం పూర్తయిన అనంతరం మండల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయి. ప్రజల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలన అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వ సేవల నాణ్యతను పెంచుతూ, ప్రజాకేంద్రిత పరిపాలనకు ఈ ప్రాజెక్టు ఆదర్శంగా నిలవనుందని ధీమా వ్యక్తం చేశారు.
మండల కార్యాలయం నిర్మించిన తర్వాత నిర్వహణ కూడా సక్రమంగా జరిగేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. అంతర్గంగా రోడ్డు వేసేలా ప్లాన్ చేసుకోవాలని అన్నారు. ఫైర్ సేప్టీ సూచనలు పాటిస్తూ నిర్మాణాలు జరగాలని అన్నారు.
మండల కార్యాలయ సముదాయం అవసరమైన విద్యుత్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు సమకూర్చుకునేలా ప్లాన్ లో భాగస్వామ్యం చేయాలని అన్నారు. సమీకృత మండల కార్యాలయ సముదాయం వద్ద అవసరమైన పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు. మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా త్రాగు నీటి సరఫరా కనెక్షన్ తీసుకోవాలని అన్నారు. ప్రతి ఫ్లోర్ లో ప్రజల వెయిటింగ్ ఏరియా ఉండాలని, అక్కడ త్రాగు నీటి ట్యాప్ ఉండాలని అన్నారు. కార్యాలయాల్లో ఫైల్స్ పెట్టెందుకు స్టోరేజ్ అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్&బీ ఎస్ఇ యుగేందర్ రావు, హౌసింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, డిఇ భగవాన్, ఏఇ కోటేశ్వరరావు, పిఆర్ డిఈ రాంబాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments