ప్రతిభకు ప్రోత్సాహం.. టాపర్ దీప్తికి రూ.25 వేల నగదు బహుమతి.
వనపర్తి,జూలై21(తెలంగాణ ముచ్చట్లు):
బాలికల విద్యను ప్రోత్సహించే సంకల్పంతో వీఐపీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో తెలుగు మాధ్యమ విభాగంలో పెద్దమందడి మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన మద్దిగట్ల–మోజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థిని కుమారి దీప్తికి రూ.25 వేల నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.వనపర్తిలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య చేతుల మీదుగా నగదు బహుమతిని అందించి విద్యార్థినిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రతిభ కనబరుస్తున్న బాలికలను ప్రోత్సహించడం ద్వారా మరింత మంది విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందుతుందని వక్తలు పేర్కొన్నారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన దీప్తి సాధించిన విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు.కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు, విద్యార్థిని తల్లిదండ్రులు పాలెం రవి, మహాలక్ష్మి, వీఐపీ సంస్థ ప్రతినిధి నాగేంద్రస్వామి, ప్రజా దర్బార్ విలేఖరి వెంకట్ గౌడ్, ఉపాధ్యాయులు, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Comments