రహదారి ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు.

రహదారి ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు.

జిల్లాస్థాయిలో రహదారి భద్రత కమిటీ సమావేశాలు తప్పనిసరి

-రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్ వికాస్ రాజ్

హనుమకొండ, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు): 

రాష్ట్రంలోని రహదారులపై ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుంచి అదనపు కార్యదర్శి డాక్టర్ ఇలంబర్తి, శాంతిభద్రతలు, రవాణా, రహదారులు–భవనాలు, జాతీయ రహదారుల శాఖల అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రవాణా, రహదారులు–భవనాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశాలను ప్రతి నెలా నిర్వహించాలని, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలని, అంబులెన్స్ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.రహదారి భద్రతపై వాహనదారుల్లో అవగాహన పెంపొందించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ ధరించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వరంగల్ పోలీసు కమిషనర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో నేషనల్ హైవేస్ అథారిటీ వరంగల్ రీజియన్ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, జాతీయ రహదారుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ కిరణ్ కుమార్, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, రహదారులు–భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ దేవిక చౌహన్, రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్ సురేష్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి జనార్దన్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ చేరాలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News