విద్యార్థుల అభ్యాసన నైపుణ్యాల పెంపులో ఉపాధ్యాయులదే కీలక పాత్ర.
జిల్లా విద్యాధికారి యాదయ్య.
పెద్దమందడి,జూలై22(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం బలిజపల్లి–జంగమాయపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మూడు రోజుల ప్రాథమిక, గణిత ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు జిల్లా విద్యాధికారి యాదయ్య శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి పర్యవేక్షణ అధికారి మహానంది, శిక్షణ బాధ్యతల అధికారి రాజేష్, మండల విద్యాధికారి ఎస్. మంజులతతో కలిసి శిక్షణ తరగతులను సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి యాదయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యాసన నైపుణ్యాల పెంపులో ఉపాధ్యాయులదే అత్యంత కీలక పాత్ర అని అన్నారు. నాణ్యమైన బోధన, నిరంతర పర్యవేక్షణ, ప్రతి విద్యార్థి నేర్చుకునే స్థాయిని గుర్తించి అందుకు అనుగుణంగా బోధించడం వల్లనే జిల్లా విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు.రెండో తరగతి విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానంలో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడం ఉపాధ్యాయుల అంకితభావం, కృషికి నిదర్శనమని కొనియాడారు. ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతాయుతంగా పనిచేసి జిల్లాను రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలని, విద్యార్థుల్లో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, గణన నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన అందించడం ద్వారా ప్రతి విద్యార్థి లక్ష్యాలను చేరుకునేలా కృషి చేయాలని అన్నారు.అనంతరం పాఠశాల ఆవరణ, విజ్ఞాన ప్రయోగశాల, పాఠశాల తోటను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి పర్యవేక్షణ అధికారి మహానంది, శిక్షణ బాధ్యతల అధికారి రాజేష్, మండల విద్యాధికారి ఎస్. మంజులత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Comments