12 ఏళ్ల నాటి తెలంగాణ ఉద్యమ కేసు విచారణ..కోర్టుకు హాజరైన జోరిక రమేష్.

12 ఏళ్ల నాటి తెలంగాణ ఉద్యమ కేసు విచారణ..కోర్టుకు హాజరైన జోరిక రమేష్.

హనుమకొండ,జులై21(తెలంగాణ ముచ్చట్లు): 

తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 12 సంవత్సరాల నాటి కేసు విచారణ మంగళవారం హనుమకొండ జిల్లా 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. ఈ కేసులో నిందితులైన తెలంగాణ ఉద్యమకారులు, గ్రేటర్ వరంగల్ మాజీ కార్పొరేటర్,
బిఆర్ఎస్ నాయకుడు  జోరిక రమేష్, చాగంటి రమేష్ న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు.ఈ కేసు 2014 జూన్ 1న, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఒక రోజు ముందు హనుమకొండలోని ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం ఘటనకు సంబంధించినది. ఈ ఘటనపై సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, ప్రస్తుతం సీసీ నంబర్ 3814/2022గా విచారణ కొనసాగుతోంది.

మంగళవారం జరిగిన విచారణలో సాక్షులను ఇరుపక్షాల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.
విచారణ అనంతరం కోర్టు ఆవరణలో జోరిక రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ కేసులను ఎత్తివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉద్యమ కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు.
పెండింగ్‌లో ఉన్న ఉద్యమ కేసులను వెంటనే ఉపసంహరించుకునేలా రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల చిత్తశుద్ధితో ఉంటే, రానున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కేసులో ఉద్యమకారుల తరఫున న్యాయవాదులు గుర్రాల వినోద్, కొండయ్య, పుల్ల ప్రవీణ్, ఎం. అంబేద్కర్, వేణు పటేల్, నాగరాజు తదితరులు వాదనలు వినిపిస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News