హుజురాబాద్‌లో సెంట్రల్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం.

ప్రజల కోసం కొత్త బ్యాంకు సేవలు.

హుజురాబాద్‌లో సెంట్రల్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం.

హుజురాబాద్, జూలై 22(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖను బుధవారం ఘనంగా ప్రారంభించారు. బ్యాంకు జోనల్ హెడ్ ఎం పిచ్చయ్య, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ కలిసి నూతన శాఖను ప్రారంభించి సేవలను ప్రారంభించారు. ఈ శాఖ ప్రారంభంతో హుజురాబాద్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఆధునిక బ్యాంకింగ్ సేవలు మరింత సులభంగా అందనున్నాయి.
ఈ సందర్భంగా జోనల్ హెడ్ ఎం. పిచ్చయ్య మాట్లాడుతూ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటని అన్నారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే బ్యాంకు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పొదుపు ఖాతాలు, డిపాజిట్ పథకాలు, వ్యవసాయ రుణాలు, వ్యాపార రుణాలు, గృహ రుణాలు, విద్యా రుణాలు, స్వయం ఉపాధి రుణాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి అన్ని సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
తెలంగాణలోని వరంగల్ రీజియన్ పరిధిలో ప్రారంభమైన 44వ శాఖ హుజురాబాద్ శాఖ కావడం సంతోషకరమని ఎం. పిచ్చయ్య పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవలను విస్తరించేందుకు బ్యాంకు కట్టుబడి ఉందని, ప్రతి వర్గానికి సులభమైన బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ, హుజురాబాద్ ప్రాంతంలో సెంట్రల్ బ్యాంక్ శాఖ ప్రారంభం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైతులు, చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలు, యువత, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకు ద్వారా రుణాలు, ఇతర ఆర్థిక సేవలను పొందాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తూ ఉత్తమ సేవలు అందించాలని బ్యాంకు అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు రీజినల్ హెడ్ ఐ. రాజ్‌కుమార్, వ్యాపారవేత్త మల్లారెడ్డి, చీఫ్ మేనేజర్ షేక్ అబ్దుల్, బ్రాంచ్ మేనేజర్ మహేష్, బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, స్థానిక ప్రముఖులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నూతన శాఖ ప్రారంభం సందర్భంగా ఖాతాదారులకు బ్యాంకు అందిస్తున్న వివిధ పథకాలు, రుణ సదుపాయాలు, డిజిటల్ సేవలపై అధికారులు అవగాహన కల్పించారు. హుజురాబాద్ ప్రాంత ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన బ్యాంకింగ్ సేవలు అందించడంలో ఈ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News