ప్రజా భద్రతే మా లక్ష్యం.
కరీంనగర్ సీపీ గౌష్ ఆలం .
జమ్మికుంట టౌన్ జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ, రోడ్డు భద్రత, నాణ్యమైన పోలీసింగ్ లక్ష్యంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం ఇల్లందకుంట మండలంలో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా సీసీ కెమెరాల ప్రారంభోత్సవం, వనమహోత్సవంలో మొక్కల నాటడం, విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ, పోలీస్ స్టేషన్‌లు మరియు సర్కిల్ కార్యాలయాల వార్షిక తనిఖీలు నిర్వహించారు.
మొదట ఇల్లందకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా నిఘా వ్యవస్థను ప్రారంభించిన సీపీ, గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల వ్యవస్థను విస్తరించాలని సూచించారు.
అనంతరం వనమహోత్సవ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అన్నారు. నేడు నాటే మొక్కలే రేపటి తరాలకు జీవనాధారమని విద్యార్థులకు వివరించారు.
విద్యార్థుల్లో భద్రతపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో అత్యవసర పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లు ముద్రించిన ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రాధాన్యం ఇస్తూ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను అందజేసిన సీపీ, హెల్మెట్ ధరించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని పేర్కొన్నారు.
ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, పోలీస్–ప్రజల సమన్వయంతోనే నేరాలను సమర్థంగా అరికట్టవచ్చని అన్నారు. గ్రామాల్లో మాదకద్రవ్యాల విక్రయం, జూదం, సైబర్ మోసాలు, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఇతర అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పర్యటనలో భాగంగా ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ నిర్వహించి కిట్ ఇన్‌స్పెక్షన్, పెండింగ్ కేసులు, రికార్డులు, ప్రభుత్వ ఆస్తులు, క్రైమ్ ప్రాపర్టీ, దర్యాప్తు పురోగతి తదితర అంశాలను సమీక్షించారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెంచడంతో పాటు నాణ్యమైన దర్యాప్తుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రతిపాదిత ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి, ఆధునిక సౌకర్యాలతో కూడిన పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం జమ్మికుంట రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, కార్యాలయ నిర్వహణ, రికార్డులు, పెండింగ్ ఫైళ్లు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో హుజూరాబాద్ ఏసీపీ మాధవి, హుజూరాబాద్ రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, జమ్మికుంట రూరల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్, ఇల్లందకుంట ఎస్సై ఎం. క్రాంతికుమార్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.


Comments