రోడ్లపై కేజ్ వీల్స్ ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు.
ఏన్కూర్ ఎస్సై సంధ్య.
ఖమ్మం బ్యూరో, జులై 22(తెలంగాణ ముచ్చట్లు )
రోడ్లపై కేజ్ వీల్స్ అమర్చిన ట్రాక్టర్లను నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏన్కూర్ ఎస్సై సంధ్య తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు కేజ్ వీల్స్ అమర్చి రోడ్లపై తిరిగే ట్రాక్టర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఏన్కూర్ మండలం, టి.ఎల్.పేట గ్రామ ప్రధాన రహదారిపై ట్రాక్టర్‌కు ఫుల్ వీల్స్ అమర్చి నడపడం వల్ల రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించి, ఈ ఘటనకు సంబంధించి టి.ఎల్.పేట గ్రామానికి చెందిన కూచిపూడి నరసింహారావు పై ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు సంబంధిత చట్టాల ప్రకారం ఏన్కూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.
ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి గ్రామాల వరకు మెరుగైన రహదారులను నిర్మిస్తోందని, కాబట్టి వాటిని సురక్షితంగా ఉంచడం, రోడ్డు దెబ్బతినకుండా చూసుకోవడం అందరి బాధ్యతని అన్నారు.
వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లకు కేజ్ వీల్స్ అమర్చడం సాధారణమే అయినప్పటికీ,పొలాల వద్ద పనులు ముగిసిన తర్వాత కేజ్ వీల్స్ తొలగించి సాధారణ టైర్లు వేసుకోవాలి. లేదా రోడ్లకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయాలు వాడాలన్నారు. ట్రాక్టర్ యజమానులు నిబంధనలు పాటించి,ట్రాక్టర్ డ్రైవర్లకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలాని సూచించారు. ఎవరైనా నిబంధనలుఉల్లంఘిస్తున్నట్లు గుర్తించినా డయల్ –100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


Comments