గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారితో ఖమ్మం అభివృద్ధి.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
-ఆగస్టు 1 నుంచి ఖమ్మం నగర ట్రాఫిక్‌కు భారీ ఉపశమనం
-దంసలాపురం గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి ఆర్‌ఓబీ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
ఖమ్మం బ్యూరో, జులై 22(తెలంగాణ ముచ్చట్లు )
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి పూర్తయితే ఖమ్మం జిల్లా అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని ఆగస్టు 1 నుంచి ఖమ్మం వైరా సత్తుపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి దంసలాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి అసలు ప్రణాళికలో దంసలాపురం వద్ద ఎగ్జిట్ లేకపోయినా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దంసలాపురం కల్లూరు సత్తుపల్లి వద్ద ప్రత్యేక ఎగ్జిట్లు తీసుకొచ్చామని తెలిపారు. దంసలాపురం ఎగ్జిట్ రైల్వే వంతెన ఆధారంగా నిర్మించబడిందన్నారు.
ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ రహదారిపై వాహనాల రాకపోకలు ప్రారంభమైతే ఖమ్మం వైరా సత్తుపల్లి ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. ఏలూరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి వైపు వెళ్లే దాదాపు 90 శాతం వాహనాలు ఈ జాతీయ రహదారినే వినియోగిస్తాయని తెలిపారు. ప్రజలకు ఈ విషయంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి భవిష్యత్తులో పరిశ్రమలు వాణిజ్యం ఉపాధి అవకాశా లకు పెద్ద ఎత్తున దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ రహదారి ద్వారా రాజమండ్రికి కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చని తెలిపారు. యాక్సెస్ కంట్రోల్డ్ హైవే కావడంతో జంతువులు ఆటోలు అనధికార క్రాసింగ్‌లు వంటి అంతరాయాలు లేకుండా సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందన్నారు.అమరావతి నుంచి భద్రాచలం మీదుగా జగదల్‌పూర్ వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారి ప్రతిపాదన ఉందని తెలిపారు. మణుగూరు నుంచి ఏటూరునాగారం మీదుగా నాగపూర్ వెళ్లే జాతీయ రహదారి కూడా రానుందని చెప్పారు. కరీంనగర్– వరంగల్ నుంచి అమరావతికి వెళ్లే రహదారి పనులు కొనసాగుతున్నాయని భూసేకరణ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఆలస్యం జరుగుతోందన్నారు.
ఖమ్మం–అశ్వారావుపేట రహదారిని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కి అప్పగించామని నాలుగు లైన్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వెంటనే డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు.ఖమ్మం ప్రవేశం నుంచి అశ్వారావుపేట వరకు ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం మార్కింగ్ పూర్తి చేసి రహదారి పక్కన ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని సూచించారు. తాను మంత్రి అయినప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక్క సెంటీమీటర్ జాతీయ రహదారి కూడా లేదని ప్రస్తుతం అన్ని దిశల్లో జాతీయ రహదారులు అభివృద్ధి చెందడం జిల్లాకు గర్వకారణమని అన్నారు.సమన్వయంతో అమరావతి రహదారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి జిల్లా పరిధిలో పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కామాంచికల్ మీదుగా ఇల్లెందు క్రాస్ రోడ్డును పొన్నెకల్ నుంచి అమరావతి రహదారికి రూ.120 కోట్లతో అనుసంధానం చేస్తున్నామని ఆ రహదారి పూర్తయితే ఇల్లెందు వైరా ప్రాంతాల ప్రజలు ఖమ్మం నగరంలోకి రాకుండానే తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
జాతీయ రహదారుల అనుసంధానంతో ఖమ్మం నగరానికి ఔటర్ రింగ్ రోడ్ తరహా వ్యవస్థ ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని ప్రయత్నించినా నిధుల కొరతతో సాధ్యం కాలేదని ఇప్పుడు జాతీయ రహదారుల ద్వారానే ఆ లక్ష్యం నెరవేరిందన్నారు. ఈ జాతీయ రహదారి ప్రారంభంతో ఖమ్మం నగరం ట్రాఫిక్ రహితంగా మారుతుందని తెలిపారు.జాతీయ రహదారి నిర్మాణం కోసం తమ విలువైన భూములను అందించిన రైతులకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సహకారం వల్లే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వేగంగా పూర్తి దశకు చేరుకుందని జిల్లా అభివృద్ధిలో రైతుల సహకారం చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు.
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ ఒక మంచి రహదారి ఏ గ్రామానికైనా పట్టణానికైనా వంద రెట్లు అభివృద్ధిని తీసుకువస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్ రావు జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ దివ్య ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్ ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments