వేలేరు మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
వేలేరు, జూలై 22 (తెలంగాణ ముచ్చట్లు )
వేలేరు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు గండి రామారం ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి గోదావరి జలాలను తీసుకువచ్చి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించే బాధ్యత తనదేనని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.వేలేరు మండలం మద్దెలగూడెం సర్పంచ్ హన్మకొండ మనోజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మద్దెలగూడెంలో రూ.43.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, నూతన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
అనంతరం వేలేరు మండల కేంద్రంలో వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ఆధ్వర్యంలో రూ.45 లక్షల సీసీ రోడ్లు, రూ.22.30 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ గోడ, రూ.10 లక్షలతో నిర్మించిన వివో భవనాన్ని ప్రారంభించారు.
సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, నెల రోజుల్లో ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయానికి రూ.2.20 కోట్లు, ఎంపీడీవో కార్యాలయానికి రూ.2 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు.
గండి రామారం ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. వేలేరు–కొమ్ముగుట్ట డబుల్ రోడ్డుకు రూ.8 కోట్లు, వేలేరు–శాలపల్లి బీటీ రోడ్డుకు రూ.4.50 కోట్లు, హ్యామ్ రోడ్ల అభివృద్ధికి రూ.13 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ పనులన్నీ 10 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు.
మద్దెలగూడెం గ్రామానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, రెండో విడతలో మరో 20 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. పీచర–కొమ్ముగుట్ట బీటీ రోడ్డును రూ.3 కోట్లతో అభివృద్ధి చేసి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు.
రైతులు ఎల్‌నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రాజకీయ అంశాలపై స్పందిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలతో రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వాదం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు బిల్లా యాదగిరి,లక్ష్మణ్ నాయక్, సద్దాం హుస్సేన్,హన్మకొండ మనోజ్, తహసీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments