ధూప దీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నావజ్జల ప్రసాద్ శర్మ ఎన్నిక.
ఖమ్మం బ్యూరో , జూలై 21(తెలంగాణ ముచ్చట్లు )
తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన అన్నావజ్జల ప్రసాద్ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం ఆవిర్భావ మహాసభ మంగళవారం హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 500 మంది ధూప దీప నైవేద్య అర్చకులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వెంగళం సంతోష్ శాస్త్రి, కోశాధికారిగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గాండ్ల రవికుమార్, గౌరవ అధ్యక్షుడిగా గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన శ్రీరంగం గోపి కృష్ణమాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కరీంనగర్ జిల్లాకు చెందిన తిరునగరి వెంకటాద్రి స్వామి, ఉపాధ్యక్షుడిగా కామారెడ్డి జిల్లాకు చెందిన మాలో రమేష్ మహారాజ్ ఎన్నికయ్యారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ అర్చక జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ సంఘం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధూప దీప నైవేద్య అర్చకులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని, వారిని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చి 99 పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
నూతన రాష్ట్ర అధ్యక్షుడు అన్నావజ్జల ప్రసాద్ శర్మ మాట్లాడుతూ తెలంగాణలో ధూప దీప నైవేద్య అర్చకుల జీవన పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అనేక దేవాలయాలు రాజకీయ ప్రభావానికి లోనవుతున్న నేపథ్యంలో అర్చకులకు ఉద్యోగ భద్రత అత్యవసరమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ధూప దీప నైవేద్య అర్చకులను సంఘటితం చేసి వారి సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో సంఘం ప్రతినిధులు పర్యటించి అర్చకుల నుంచి వినతిపత్రాలు సేకరించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు రాష్ట్ర మంత్రులందరికీ అందజేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన అర్చకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు మునగలేటి రమేష్ శర్మ, జిల్లా కార్యదర్శి మరింగంటి భార్గవాచార్యులు పాల్గొని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అన్నావజ్జల ప్రసాద్ శర్మకు అభినందనలు తెలిపారు.


Comments