ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ కడియం కావ్య.

వరంగల్ జిల్లాలో ఉపాధి, వేతనాల చెల్లింపుల వివరాలు వెల్లడించిన కేంద్రం.

ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ కడియం కావ్య.

న్యూఢిల్లీ, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు): 

వరంగల్ జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, ఉపాధి కల్పన, వేతనాల చెల్లింపుల స్థితిగతులపై వరంగల్ లోక్‌సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఉపాధి కోరిన కుటుంబాలకు ఎంత మేర పని కల్పించారు, ఒక్కో కుటుంబానికి సగటున ఎన్ని పనిదినాలు లభించాయి, వేతనాల చెల్లింపుల్లో ఏవైనా బకాయిలు ఉన్నాయా అనే అంశాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను వివరణ కోరారు.ఈ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేశ్ పాస్వాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, వరంగల్ జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కోరిన అర్హ కుటుంబాల్లో 99.99 శాతం మందికి, 2025–26 ఆర్థిక సంవత్సరంలో 99.97 శాతం మందికి పని కల్పించారు. ఒక్కో కుటుంబానికి సగటున 2024–25లో 41.12 పనిదినాలు, 2025–26లో 27.89 పనిదినాలు లభించాయి.ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించడంలో వరంగల్ జిల్లా మెరుగైన ఫలితాలు సాధించడం సంతోషకరమన్నారు. గ్రామీణ ప్రజల సమస్యలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావిస్తూ, వారి హక్కులు, సంక్షేమ పథకాల అమలుపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

వేతనాల చెల్లింపుల విషయంలో వరంగల్ జిల్లాలో ఎలాంటి పెండింగ్ బకాయిలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం సానుకూల పరిణామమన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా కూలీల ఖాతాల్లోకి నేరుగా వేతనాలు జమ కావడం వల్ల పారదర్శకత పెరిగిందని పేర్కొన్నారు.భవిష్యత్తులో ఉపాధి కల్పన రోజులను మరింత పెంచడంతో పాటు మహిళలు, బలహీన వర్గాల భాగస్వామ్యాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన ఆస్తుల సృష్టి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News