విజయవంతమైన వామపక్ష విద్యార్థి సంఘాల బంద్.
ప్రభుత్వానికి విద్యార్థి సంఘాల వినతి.
హుజురాబాద్, జూలై 10(తెలంగాణ ముచ్చట్లు ):
విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమం విజయవంతమైందని విద్యార్థి సంఘ నాయకులు కొలుగూరి సూర్యకిరణ్, రామారపు వెంకటేశ్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగంపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాక రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను క్లస్టర్ స్కూల్స్‌గా విలీనం చేసే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, ప్రతి జిల్లాకు పూర్తిస్థాయి జిల్లా విద్యాధికారులను నియమించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయ
కులు రాంపల్లి రోహిత్, రాహుల్, సాయి తేజ, సందీప్, నవీన్, బన్నీ, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.


Comments