ప్రజా సమస్యలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి: మిల్కూరి వాసుదేవరెడ్డి.
జమ్మికుంట టౌన్ జూలై 08 (తెలంగాణ ముచ్చట్లు):
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి విస్తృత ఉద్యమాలు నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జమ్మికుంటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక, కూలీల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను అవలంబిస్తోందని విమర్శించిన ఆయన, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే దిశగా మూడో డిస్కంను తీసుకురావడం ప్రజా వ్యతిరేక చర్య అని ఆరోపించారు. భవిష్యత్తులో రైతులకు ఉచిత విద్యుత్‌కు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి సంబంధించిన విధానాలపైనా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని, వరి వంగడాల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. ప్రాసెసింగ్‌లో జరుగుతున్న అక్రమాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరిన ఆయన, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతతో పాటు మౌలిక సదుపాయాల లేమి కారణంగా పేదలు ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేసి, ప్రభుత్వ విద్యా, వైద్య సేవలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా, వైద్య సంస్థల ఫీజులను నియంత్రించే చట్టాన్ని తీసుకురావాలని కూడా కోరారు.
జమ్మికుంట పట్టణంలోని పలు కాలనీల్లో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత పాలకులు ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. నాయిని చెరువు సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి జక్కుల రమేష్ యాదవ్, మండల కమిటీ సభ్యులు బాసిర సంపత్‌రావు, దండిగారి సతీష్, వడ్లూరి కిషోర్, రావుల ఓదెలు, క్రాంతికుమార్, మధునయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments