ఎల్కతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.
ఏకపక్ష నియామకాలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.
ఎల్కతుర్తి, జూలై 8 (తెలంగాణ ముచ్చట్లు):
మండల పరిధిలోని ది విశాల సహకార బ్యాంకు నూతన పాలకవర్గంలో నామినేటెడ్ సొసైటీ డైరెక్టర్ పదవుల నియామకాలపై కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దాదాపు తొమ్మిదేళ్ల పాటు కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలను పక్కనపెట్టి కొందరికే పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
స్థానిక నాయకులను, గ్రామాల ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా ఏకపక్షంగా నియామకాలు చేపడుతున్నారని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గ్రామాల్లో పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు తదితర ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పదవులు భర్తీ చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.
మండలంలో నియమితులవుతున్న వ్యక్తుల రాజకీయ నేపథ్యం, పార్టీ కోసం చేసిన సేవలు, అర్హతలను పరిగణనలోకి తీసుకోకుండా నామినేషన్లు జరుగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా శ్రమించిన నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది.
నియామకాలను తాత్కాలికంగా నిలిపివేసి సంబంధిత గ్రామాల నాయకులతో సమావేశం నిర్వహించి, ఏకాభిప్రాయం మేరకు అర్హులైన పార్టీ కార్యకర్తలకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వ్యవహారంపై చొరవ తీసుకుని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


Comments