దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .
-బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి
-జులైవాడలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హనుమకొండ, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు):
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జులైవాడలో బీఆర్ఎస్ నాయకుడు అంకం లక్ష్మణ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ ఎప్పటికీ స్మరించుకోవాలని సూచించారు.
దేశ స్వాతంత్ర్యం అంటే కేవలం జెండా ఆవిష్కరణ, వేడుకలకు మాత్రమే పరిమితం కాకూడదని అన్నారు. దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు, గౌరవం, భద్రత, విద్య, ఉపాధి అందినప్పుడే స్వాతంత్ర్యానికి నిజమైన అర్థం చేకూరుతుందని పేర్కొన్నారు. యువత దేశ భవిష్యత్తును నిర్మించే శక్తిగా ఎదగాలని, విద్యతో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని, కులం, మతం, ప్రాంతం వంటి భేదాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిరంతరం కృషి చేయాలని రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తితో సమాజం, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Comments