వరి పంటకే మద్దతు ధర, బోనస్ ఇస్తుంటే ఇతర పంటల వైపు ఎలా వెళ్లాలి ?
రైతు అల్వాల వెంకటరెడ్డి.
పెద్దమందడి,ఆగస్టు11(తెలంగాణ ముచ్చట్లు):
ప్రభుత్వం వరి పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ అందిస్తామని చెబుతూ రైతులను వరి సాగు వైపే ప్రోత్సహిస్తున్నప్పుడు, ఇతర పంటల వైపు ఎలా వెళ్లాలని రైతు వెంకటరెడ్డి ప్రశ్నించారు. మంగళవారం వనపర్తి జిల్లా పెద్దమందడి రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని రైతులతో మాట్లాడుతున్న సందర్భంగా.. రైతు వెంకట్ రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.వరి పంటకు మద్దతు ధర, బోనస్ వంటి ప్రోత్సాహకాలు ఉన్నప్పుడు రైతులు సహజంగానే వరి సాగు వైపే మొగ్గుచూపుతారని వెంకటరెడ్డి అన్నారు. ఒకవైపు వరి సాగు చేయొద్దని, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు సూచిస్తుంటే.. మరోవైపు వరికి మద్దతు ధర, బోనస్ వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ఎలా మళ్లుతారని ప్రశ్నించారు.ఆరుతడి పంటలను ప్రోత్సహించాలంటే వాటికి కూడా వరికి ఇస్తున్న విధంగా నాణ్యమైన విత్తనాలు, గిట్టుబాటు ధర, బోనస్ వంటి ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు. కేవలం రైతులను ఇతర పంటలు సాగు చేయాలని సూచించడం కాకుండా, ఆ పంటలకు మార్కెట్ భరోసా, ధరల పరంగా ప్రభుత్వ మద్దతు కల్పిస్తేనే రైతులు ఆరుతడి పంటల వైపు ఆసక్తి చూపుతారని అన్నారు.


Comments