నీళ్లు ఉన్నాయని వరి వేస్తే ఇబ్బందులే!
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం.
పెద్దమందడి,ఆగస్టు11(తెలంగాణ ముచ్చట్లు):
ప్రస్తుతానికి నీళ్లు అందుబాటులో ఉన్నాయని తొందరపడి వరి సాగు చేసి, రానున్న రోజుల్లో ఇబ్బందులు పడొద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని, రాబోయే రెండు నెలల్లో వర్షాలు తగ్గే ప్రమాదం ఉన్నందున రైతులు ముందుచూపుతో ఆరుతడి పంటలు, పామాయిల్, కూరగాయలు సాగు చేసుకోవాలని కోరారు.పెద్దమందడి రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. గత ఏడాది ఆగస్టు నాటికి మండలంలో 100 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదుకాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 76 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందన్నారు. గత ఏడాది 22 వేల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, 18 వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది వరికి అవసరమైన స్థాయిలో నీరు అందే అవకాశం లేదని, భూగర్భ జలాలు కూడా తగ్గుతున్నాయని చెప్పారు.రైతులు వేరుసెనగ, మినుములు, కూరగాయలు వంటి ఆరుతడి పంటలతో పాటు పామాయిల్ సాగు చేపట్టాలని సూచించారు. ఆరుతడి పంటలకు నాణ్యమైన, లాభదాయకమైన విత్తనాలు అందించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు.జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ పామాయిల్ సాగును ప్రభుత్వం సబ్సిడీతో ప్రోత్సహిస్తోందన్నారు. ఒక ఎకరం వరికి వినియోగించే నీటితో మూడు ఎకరాల పామాయిల్ సాగు చేయవచ్చని తెలిపారు. ఎకరానికి 5 నుంచి 7 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. కూరగాయల సాగుకు ఎకరానికి రూ.9,600 సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు.రైతు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. వరికి మద్దతు ధరతో పాటు బోనస్ అందుతున్నందున రైతులు ఇతర పంటల వైపు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. ఆరుతడి పంటలకు నాణ్యమైన విత్తనాలతో పాటు బోనస్ అందించాలని కోరారు.కార్యక్రమంలో తహసిల్దార్ మల్లికార్జున్, ఎంపీడీఓ పర్ణిత, సింగిల్ విండో చైర్మన్ సత్యారెడ్డి, మండల వ్యవసాయ అధికారి సైదులు, సర్పంచ్ సూర్యగంగమ్మ, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Comments