హుజురాబాద్ సమస్యలపై మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

హుజురాబాద్ సమస్యలపై మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి.. సానుకూలంగా స్పందించిన మంత్రులు.

హుజురాబాద్ , ఆగస్టు 8(తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పరిష్కరించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర మంత్రులను కోరారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించగా, ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే నియోజకవర్గంలోని సమస్యలపై విస్తృతంగా వివరించారు.
కాల్వల ప్రాజెక్టుకు రూ.డెబ్భై కోట్లు ఇవ్వాలి
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి కాల్వల ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు రూ.డెబ్భై కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే పేలుళ్ల కారణంగా దెబ్బతిన్న తనుగుల చెక్‌డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని, కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్ చేసి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు తాగు, సాగునీరు అందించాలని కోరారు.
ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
కరీంనగర్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే కమలాపూర్ పెద్దమ్మతల్లి ఆలయ అభివృద్ధికి రూ.ఇరవై కోట్లు మంజూరు చేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
రహదారులు, మున్సిపాలిటీలకు నిధులు
వీణవంక మండలంలోని డబుల్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని కోరిన ఎమ్మెల్యే, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు గతంలో మంజూరైన రూ.పదిహేను కోట్ల చొప్పున నిధులతో పనులు ప్రారంభించాలని కోరారు.
జమ్మికుంట, హుజురాబాద్ పట్టణాల్లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు సుమారు ఎనబై శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను పూర్తి చేసేందుకు రెండు పట్టణాలకు రూ.రెండు కోట్ల చొప్పున నిధులు అవసరమని తెలిపారు. జమ్మికుంట పట్టణంలో వంద శాతం ట్యాక్స్ కలెక్షన్ సాధించినందుకు ఇన్సెంటివ్‌గా రావాల్సిన రూ.మూడు కోట్లను విడుదల చేయాలని కోరారు.
ఇసుక ధరలు తగ్గించాలి.. ట్రాక్టర్లకు ఆన్‌లైన్ విధానం తొలగించాలి
నియోజకవర్గంలో ఇసుక రవాణా కారణంగా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇసుక లభ్యత ఉన్నప్పటికీ రూ.పదిహేను వందలకు లభించాల్సిన ఇసుక రూ.ఏడువేల అయిదువందల వరకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.
పెద్దపల్లి, మానకొండూర్ నియోజకవర్గాల్లో అమలు చేస్తున్న విధానం మాదిరిగా హుజురాబాద్ నియోజకవర్గంలోనూ ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపునకు ఆన్‌లైన్ విధానం లేకుండా అనుమతులు కల్పించాలని కోరారు. దీనివల్ల ప్రజలకు తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
బీపీ, షుగర్ మందులు అందుబాటులోకి తేవాలి
జమ్మికుంట మండలంలో బీపీ, షుగర్ మందులు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే అవసరమైన మందులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కమలాపూర్ బస్టాండ్‌కు హాస్పిటల్ స్థలం కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
దళిత బంధు, ఇందిరమ్మ ఇళ్లపై విజ్ఞప్తి
దళిత బంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. సైదాబాద్‌లో ఇళ్ల పట్టాలను తిరిగి ఇవ్వాలని, హుజురాబాద్ మీడియా మిత్రులకు గతంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో వాటిని తిరిగి ఇవ్వాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రద్దు చేసిన కొన్ని ప్రొసీడింగ్స్‌ను కూడా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
కరీంనగర్ జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన పాడి కౌశిక్ రెడ్డి, దొంగతనాలు, హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లా అండ్ ఆర్డర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజలకు భద్రత కల్పించేలా పోలీసు శాఖకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సానుకూలంగా స్పందించిన మంత్రులు
హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రులకు వినతిపత్రం అందించారు. నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, అభివృద్ధి పనులపై మంత్రులు సానుకూలంగా స్పందించి, అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.IMG-20260808-WA0021

Tags:

Post Your Comments

Comments

Latest News