గాంధీజీ అడుగుజాడల్లో వెలసిన ఖాదీ ప్రతిష్ఠాన్.. నేడు ఉనికి కోసం పోరాటం!
ఒకప్పుడు వేలాది చేనేత కుటుంబాలకు ఉపాధి.. నేడు ఉనికి కోసం పోరాటం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 07 (తెలంగాణ ముచ్చట్లు):
స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో 1919లో ఏర్పాటైన జమ్మికుంట మండలం వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్ (కేఎన్‌ఆర్(డీ)) నేడు ఆదరణ కోల్పోయి కష్టాలను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిన ఈ సంస్థలో ప్రస్తుతం వంద మందికి కూడా పని లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
స్వదేశీ నినాదంతో ప్రారంభమైన ఈ ఖాదీ సంస్థకు జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వంటి ప్రముఖులు అధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రస్తుతం పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవి సంస్థ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది చేనేత కార్మికులు ఈ సంస్థ ద్వారా జీవనోపాధి పొందేవారు. ఖాదీ ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉండేది. అయితే కాలక్రమేణా ప్రభుత్వ ప్రోత్సాహం తగ్గడం, మార్కెట్‌లో మార్పులు రావడంతో సంస్థ కార్యకలాపాలు క్రమంగా క్షీణించాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖాదీ సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించి, చేనేత కార్మికులకు తిరిగి ఉపాధి కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చారిత్రక వారసత్వం కలిగిన వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Comments