వీణవంకలో సమస్యల సుడిగుండం.. బీజేపీ ఆగ్రహం.
పారిశుద్ధ్యం, ఇసుక కొరతపై అధికారుల తీరుపై ఆగ్రహం.
వీణవంక, ఆగస్టు 07 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని బీజేపీ వీణవంక మండల అధ్యక్షుడు బత్తిని నరేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచకపోతే సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మురుగు కాలువల శుభ్రత, పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
సామాన్య ప్రజలకు ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయని బత్తిని నరేశ్ గౌడ్ తెలిపారు. నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులు, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో కొందరు కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రభుత్వం స్పందించాలని కోరుతూ బీజేపీ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


Comments