హుజురాబాద్ సభలో రావుల వేణుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కితాబు.
*"నుదిటి సింధూరమే వేణు ప్రత్యేక గుర్తింపు.. ప్రతి హిందువు సంప్రదాయాలను గౌరవించాలి"*
హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు, కట్టర్ కాషాయవాది రావుల వేణును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల హుజురాబాద్‌కు విచ్చేసిన కేంద్ర మంత్రికి రావుల వేణు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ రావుల వేణు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రావుల వేణు ఎల్లప్పుడూ నుదిటిపై సింధూరం ధరించి హైందవ సంప్రదాయాల పట్ల తన అంకితభావాన్ని చాటుకుంటున్నారని పేర్కొన్నారు. "వేణు నుదిటిపై సింధూరం ఉంటేనే వెంటనే గుర్తుపట్టగలుగుతాం. అదే ఆయనకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. సింధూరం లేకపోతే ఆయన ముఖంలో ఏదో వెలితి కనిపించినట్లు అనిపిస్తుంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. సభలో ఈ వ్యాఖ్యలకు కార్యకర్తలు ఘన చప్పట్లతో స్పందించారు.
రావుల వేణు వంటి సిద్ధాంత నిబద్ధత కలిగిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి బలమని కేంద్ర మంత్రి అన్నారు. వ్యక్తిగత జీవితంలోనూ, సామాజిక కార్యక్రమాల్లోనూ హైందవ సంప్రదాయాలను ఆచరిస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రతి కార్యకర్త రావుల వేణు వంటి క్రమశిక్షణ, నిబద్ధతను అలవర్చుకోవాలని సూచించారు.
హైందవ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యత అని బండి సంజయ్ పేర్కొన్నారు. నుదిటిపై సింధూరం ధరించడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా మన సంస్కృతి, విశ్వాసానికి ప్రతీక అని చెప్పారు. హిందువులందరూ తమ సంప్రదాయాలను గౌరవించి ఆచరించాలని పిలుపునిచ్చారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రావుల వేణుపై ఆయన వ్యక్తం చేసిన ప్రశంసలు హుజురాబాద్ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, స్థానిక రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.


Comments