పాడి పశువుల సంరక్షణ–పాల ఉత్పాదకత పెంపుపై రైతులకు అవగాహన శిక్షణ.
భీమదేవరపల్లి, జూలై 30(తెలంగాణ ముచ్చట్లు):
పాడి
రైతులకు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించి పాల ఉత్పాదకతను పెంచడంతో పాటు రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయాలనే లక్ష్యంతో "పాడి పశువుల సంరక్షణ మరియు పాల ఉత్పాదకత పెంపు" అంశంపై శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.సంఘ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. వై. రాధాకృష్ణ, సహాయ సంచాలకులు డా. ఎన్. సత్యప్రసాద్ రెడ్డి, డా. రఘుబాబు, స్థానిక పశువైద్యులు ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు శాస్త్రీయ సూచనలు అందించారు. సంఘ జనరల్ మేనేజర్ ఎం. రాం రెడ్డి, సంఘ కార్యవర్గ సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
శిక్షణలో భాగంగా డా. జె. రవికుమార్ గడ్డి రకాలు, పాడి పశువుల పోషణపై, డా. రాజన్న పాడి పశువుల పెంపకం, యాజమాన్య పద్ధతులపై, డా. రాజబాబు దూడల సంరక్షణ ప్రాధాన్యతపై, డా. రాజి రెడ్డి గర్భకోశ సంబంధిత సమస్యలు, నివారణ, చికిత్సపై రైతులకు సమగ్ర అవగాహనకల్పించారు.అదేవిధంగా ఉత్తమ జాతుల ఎంపిక, ఆరోగ్యవంతమైన పాడి పశువుల నిర్వహణ, పశువుల కొట్టాల నిర్మాణ ప్రమాణాలు, సమతుల్య దాణా, పాల ఉత్పాదకత పెంపు, దూడల సంరక్షణ, చిన్న వయసు పశువుల పెంపకం, పునరుత్పత్తి సంబంధిత వ్యాధుల నివారణ వంటి అంశాలపై నిపుణులు వివరించారు.
ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులు ఒక్కో పాడి పశువు నుంచి అధిక పాల ఉత్పత్తి సాధించి ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. శిక్షణలో అందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా పాడి పరిశ్రమను మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చని పేర్కొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న రైతులు నిపుణులు అందించిన సూచనలపై ఆసక్తి కనబరిచి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.


Comments