ప్రజా సమస్యలపై కలెక్టర్‌ను కలిసిన కౌశిక్ రెడ్డి.
దళిత బంధు, సాగునీరు, రహదారుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి.
హుజూరాబాద్,28(తెలంగాణ ముచ్చట్లు ):
హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దళిత బంధు రెండో విడత నిధుల విడుదల, సాగునీటి సరఫరా, దెబ్బతిన్న రహదారుల మరమ్మతులతో పాటు ఇతర అభివృద్ధి అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా వేలాది దళిత కుటుంబాలు ఆర్థికంగా స్వావలంబన సాధించాయని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు రెండో విడతను నిలిపివేయడంతో అర్హులైన లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారని విమర్శించారు. ఎన్నికల హామీలకు అనుగుణంగా వెంటనే రెండో విడత నిధులను విడుదల చేసి ప్రతి అర్హ కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కన్నెపల్లి పంపుల ద్వారా అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నందిమేడారం, మిడ్ మానేరు వరకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కాల్వల మరమ్మతులు చేపట్టి పంటలకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇసుక క్యారీల రాకపోకల కారణంగా హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల్లో ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో ప్రజలు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే రహదారులను మరమ్మతు చేసి సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.
నియోజకవర్గంలోని ఇతర అభివృద్ధి, ప్రజా సమస్యలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, హుజూరాబాద్ ప్రజల హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తూ పోరాటం కొనసాగిస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.


Comments