నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థుల ఉద్యమాలను అణచివేయడం దారుణం.
హైదరాబాద్ నిరసనకు విద్యార్థులు, యువత భారీగా తరలిరావాలి:
-- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి,జూలై23(తెలంగాణ ముచ్చట్లు):
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అణచివేత ధోరణిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేయడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని, ఆ హక్కులను కాలరాయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు.హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించి తన నివాసంలో విద్యార్థి, యువజన విభాగాల ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.నీట్ పరీక్షలో జరిగిన అక్రమాల వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్న నిరంజన్ రెడ్డి, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత స్వీకరించి రాజీనామా చేయాలని ఆయన కోరారు.విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఉద్యమాలను అణచివేయడం సరైన విధానం కాదన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే ప్రతి ఒక్కరూ ఇటువంటి చర్యలను ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, చెన్నారం రమేష్, మహమూద్, బండారు కృష్ణ, చంద్రశేఖర్, డాక్టర్ డ్యానియల్, భాగ్యరాజ్, సయ్యద్ జమీల్, బాబు నాయక్, అస్లాం, ఇమ్రాన్, జిల్లా విద్యార్థి కో-ఆర్డినేటర్ హేమంత్ ముదిరాజ్, యువత అధ్యక్షుడు సూర్యవంశం గిరి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు జోహెబ్ హుస్సేన్, యూసుఫ్, మండల యువత అధ్యక్షుడు చిట్యాల రాము, మునికుమార్, క్రాంతి, లక్ష్మణ్ గౌడ్, శివప్రసాద్ గౌడ్, శిరివాటి శంకర్, కుమార్, అలీమ్ తదితరులు పాల్గొన్నారు.


Comments