అంబేద్కర్ విగ్రహం వద్ద ఆక్రమణలు తొలగించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వినతి.
మహబూబ్‌నగర్,జూలై22(తెలంగాణ ముచ్చట్లు):
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలిధుపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆర్‌ఎంబీ రహదారిపై పెరిగిన ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలను తొలగించి ఆక్రమణలను నివారించాలని కోరుతూ బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ సదస్సులో కమిషన్‌కు వినతిపత్రం అందజేశారు.గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు ఆంజనేయులు సమర్పించిన వినతిపత్రంలో, గతంలో దళిత సర్పంచ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఉన్న ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలను తొలగించేందుకు ప్రయత్నించగా కొందరు అడ్డుకున్నారని పేర్కొన్నారు. అలాగే 2024 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసే సమయంలో అంబేద్కర్ సంఘం సభ్యులు, ఎంపీటీసీ, కాలనీవాసులను అడ్డుకుని కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని, ఈ ఘటనపై అడ్డాకుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సంబంధిత వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని తెలిపారు.అయినప్పటికీ ఇప్పటికీ అంబేద్కర్ విగ్రహం ముందు పెరిగిన ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలను తొలగించకపోవడంతో పాటు అవి రహదారిపైకి విస్తరించి గ్రామస్తులు, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకు వినతులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా కుల వివక్ష పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బాలరాజ్, టీఆర్పీ పార్టీ దేవరకద్ర ఇన్‌చార్జి మంగరాయి వెంకటేష్, బీఎస్పీ మండల అధ్యక్షుడు ప్రసాద్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, గ్రామస్తులు మోహన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.


Comments