ఐదో వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ విస్తరణకు వినతి.
జమ్మికుంట టౌన్ జులై 21 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని ఐదో వార్డులో మిషన్ భగీరథ తాగునీటి పైపులైన్ అందని ఇళ్లకు వెంటనే పైపులైన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ వార్డు ప్రజలు మంగళవారం మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్‌కు వినతిపత్రం సమర్పించారు.
మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వార్డు ప్రజలు, తమ ప్రాంతంలోని పలు గృహాలకు ఇప్పటికీ మిషన్ భగీరథ పైపులైన్ వేయకపోవడంతో తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నామని వివరించారు. సంబంధిత ఇళ్లకు పైపులైన్ వేయించి శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణ పరిధిలోని మిర్జీడు, కొత్తపల్లి ప్రాంతాలకు అమృత్ పథకం ద్వారా తాగునీటి సరఫరా కోసం కొత్త పైపులైన్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అదే క్రమంలో ఐదో వార్డులో పైపులైన్ లేని గృహాలకు కూడా మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం అందేలా సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలను సానుకూలంగా స్వీకరించి పరిష్కారానికి హామీ ఇవ్వడంపై వార్డు ప్రజలు మున్సిపల్ చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యాట్ల అవినాష్, రమేష్, కాళోజీ లక్ష్మణ్, సంజీవ్, శ్రీనివాస్, ప్రణీత తదితరులు పాల్గొన్నారు.


Comments