వైన్స్ షాపుకు రూ.5,000 జరిమానా విధించిన వేలేరు మేజర్ గ్రామపంచాయతీ.
వేలేరు, జూలై 20 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల కేంద్రంలోని ఓ వైన్స్ షాపు వద్ద రోడ్డుపై వాహనాలను నిలిపివేయడం, ప్లాస్టిక్ గ్లాసులు, ఖాళీ బాటిళ్లను రోడ్డు డివైడర్‌లో పడేయడం, అలాగే పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో ఆ షాపుకు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ రూ.5,000 జరిమానా విధించింది.గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీమతి విజయ షాపును తనిఖీ చేసి జరిమానా విధించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి, కార్యదర్శి విజయ మాట్లాడుతూ గ్రామంలోని అన్ని షాపుల యజమానులు తమ షాపుల ముందు పార్కింగ్ సక్రమంగా ఉండేలా చూడడంతో పాటు పారిశుద్ధ్యాన్ని కచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే తూనికలు, కొలతల నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై గ్రామపంచాయతీ చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ తనిఖీ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


Comments