సంఘ ఐక్యతే లక్ష్యం.. జూలై 27న పెయింటర్స్ వర్క్ బంద్.
నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా.
జమ్మికుంట టౌన్ జూలై 20 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలో పెయింటింగ్ వృత్తి నిర్వహిస్తున్న సభ్యులు సంఘం నిర్ణయించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జమ్మికుంట పట్టణ పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేసింది. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సభ్యులందరికీ వర్తించే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.
సంఘ నిర్ణయం ప్రకారం ప్రతి మేస్త్రీ గరిష్ఠంగా ఎనిమిది మంది లేబర్లతో మాత్రమే పనులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సంఘం నిర్ణయించిన పని రేట్ల కంటే తక్కువ ధరలకు పనులు చేపట్టినట్లు తేలితే సంబంధిత సభ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక పెయింటర్లకు ఉద్దేశపూర్వకంగా పని రాకుండా చేసే చర్యలకు పాల్పడిన వారిపై సభ్యత్వం రద్దు వరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అదేవిధంగా సంఘ నియమ నిబంధనలను ఉల్లంఘించిన ఏ సభ్యుడిపైనైనా సభ్యత్వం రద్దుతో పాటు సంఘం నిర్ణయించిన క్రమశిక్షణ చర్యలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 27వ తేదీన జమ్మికుంట పట్టణ పరిధిలో అన్ని పెయింటింగ్ పనులను పూర్తిగా బంద్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ రోజున అన్ని మేస్త్రీలు, లేబర్లు, అలాగే పి.ఓ.పి. పనులు చేసే కార్మికులు తప్పనిసరిగా సంఘ సమావేశానికి హాజరుకావాలని సూచించారు. సమావేశ నిర్ణయాలను ధిక్కరించి పనులు చేసినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రూ.5,000 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.
సభ్యులందరూ సంఘ నిర్ణయాలను గౌరవించి, ఐక్యతను కాపాడుతూ నియమ నిబంధనలకు కట్టుబడి సహకరించాలని సంఘం విజ్ఞప్తి చేసింది.
ఈ ప్రకటనను సంఘ అధ్యక్షుడు బక్కె రవీందర్, ప్రధాన కార్యదర్శి చోలేటి శ్యామ్ కుమార్, ఉపాధ్యక్షుడు పొడేటి మొగిలి, కోశాధికారి మైస శ్రీను, ప్రచార కార్యదర్శి కల్లెపల్లి రమేష్ విడుదల చేశారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కొండపాక సమ్మయ్య, వంతడుపుల అనిల్, జక్కె ప్రభాకర్, జమీర్, యు.పి. రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments