సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
- ఎస్‌ఐఆర్‌పై శ్రేణులకు అవగాహన.
- కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శలు.
సత్తుపల్లి, జూలై 17 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు ఎస్‌ఐఆర్ అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఓటు చోరీపై చర్చ జరుగుతుండగా, తెలంగాణలో మాత్రం అభివృద్ధి పనుల క్రెడిట్ చోరీ జరుగుతోందని ఆరోపించారు
. సీతారామ ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగిందని, ఆ ప్రాజెక్టు ఘనతను కాంగ్రెస్ ప్రభుత్వం సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రాజెక్టు క్రెడిట్ కోసం కాంగ్రెస్ మంత్రుల మధ్యే పోటీ నెలకొందని, ఒక మంత్రి పర్యటన గురించి మరో మంత్రికి తెలియని పరిస్థితి నెలకొనడం వారి అంతర్గత విభేదాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఎల్‌నీనో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన తర్వాతే సాగునీటి పంపులను ప్రారంభించారని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు రెండో ఎండాకాలాన్ని తలపిస్తున్నాయని అన్నారు. గోదావరి జలాలను సమర్థంగా వినియోగించి రైతులకు సకాలంలో సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సర్వేలన్నీ బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్న సండ్ర వెంకట వీరయ్య.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments