గోవులకు రక్షణ–ప్రజలకు భద్రత.. జమ్మికుంటలో గోశాల ఏర్పాటుకు చేయాలి.
జమ్మికుంట టౌన్ జులై 16 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో శాశ్వత గోశాల ఏర్పాటు చేయాలని కోరుతూ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ మున్సిపల్ చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు పట్టణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేశారు.
పట్టణ అభివృద్ధి కోసం మున్సిపల్ పాలకవర్గం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అభినందించిన ఆమె, ప్రస్తుతం రోడ్లపై సంచరిస్తున్న గోవుల సంరక్షణకు శాశ్వత పరిష్కారం అవసరమని పేర్కొన్నారు. గోవులు ప్లాస్టిక్ కవర్లు, విషపూరిత వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు తిని అనారోగ్యానికి గురవుతున్నాయని, రహదారులపై సంచరించడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటమే కాకుండా ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు గోశాల ఏర్పాటు కోసం తగిన స్థలాన్ని గుర్తించి కేటాయించడంతో పాటు అవసరమైన చర్యలను తక్షణమే ప్రారంభించాలని ఆమె కోరారు.
గోమాతల సంరక్షణ కేవలం సామాజిక బాధ్యత మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని చేపట్టి జమ్మికుంటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని పట్టణ ప్రజల ఆకాంక్ష అని పూదరి రేణుక శివకుమార్ గౌడ్ తెలిపారు.


Comments