ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల సమస్యలు పరిష్కరించాలి.
హుజూరాబాద్‌లో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత.
హుజూరాబాద్, జూలై 14(తెలంగాణ ముచ్చట్లు ):
సమాజంలో మధ్యతరగతి జీవితం గడుపుతూ ఉపాధి పొందుతున్న ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని స్వయంకృషి ప్లంబర్ యూనియన్ అధ్యక్షుడు మొరే రవి, ప్రధాన కార్యదర్శి జున్నాతుల శ్రీనివాస్, శుభజ్యోతి ఎలక్ట్రిషియన్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంగెం వెంకటస్వామి, కార్యదర్శి జున్నాతుల శ్రీనివాస్‌లు డిమాండ్ చేశారు.
మంగళవారం హుజూరాబాద్ పట్టణంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. అనంతరం హుజూరాబాద్ తహసీల్దార్ జక్కని నరేందర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నప్పటికీ పేదరికంలోనే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అలాగే సంఘ భవన నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలంలో ఒక గుంట భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు నిర్ణయించిన కూలి రేట్లను అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్‌కు చెందిన నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments