పాఠశాలల నుంచే ఆరోగ్య పరిరక్షణ.. జమ్మికుంటలో ఆల్బెండజోల్ పంపిణీ.
జమ్మికుంట టౌన్ జూలై 13 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట మున్సిపల్, మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 44 ప్రభుత్వ పాఠశాలలు, 56 అంగన్వాడీ కేంద్రాలు, 17 ప్రైవేట్ పాఠశాలలు, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల, ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రెండు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందించారు.
జమ్మికుంట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు ఎంతో ఉపయోగకరమని, ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాత్రలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన బాల్యం కోసం ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మాత్రలు తీసుకోలేకపోయిన విద్యార్థులకు ఈ నెల 20వ తేదీన నిర్వహించే మాప్-అప్ డే సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వరుణ, మండల విద్యాధికారి ప్రేమలత, కౌన్సిలర్ మాచర్ల రాజు, డాక్టర్ చందన, డాక్టర్ మహోన్నత్ పటేల్, డాక్టర్ బిందు, డాక్టర్ కార్తీక్, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ సంధ్య, ప్రధానోపాధ్యాయుడు బాదం సురేష్, సూపర్వైజర్ సదానందం, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


Comments