కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా..? అధికారుల వైఫల్యమా..? ఎన్ హెచ్ 765డి జి పై ప్రశ్నల వర్షం.
–వెంటనే పనులు పూర్తి చేయాలి.. లేదంటే ప్రజలతో కలిసి ఆందోళన
–బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్
ఎల్కతుర్తి, జూలై 13( తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం నుంచి దామెర గ్రామానికి వెళ్లే ఎన్ హెచ్ 765డి జి జాతీయ రహదారిపై చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటంతో రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారి పక్కన లోతైన గుంతలు తవ్వి పనులను మధ్యలోనే నిలిపివేయడంతో వాహనదారులు, పాదచారులు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో హెచ్చరిక బోర్డులు, రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయంతో ప్రజలు ప్రయాణిస్తున్నారని తెలిపారు.
డ్రైనేజీలో మురుగు నీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల సమస్య తీవ్రంగా పెరిగి ప్రజారోగ్యానికి కూడా ముప్పుగా మారిందన్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ దుస్థితికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా..? అధికారుల పర్యవేక్షణ వైఫల్యమా..? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని శ్రీకాంత్ యాదవ్ అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, భద్రతా చర్యలు పాటించకపోవడం బాధాకరమని విమర్శించారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేయడంతో పాటు రహదారిని మరమ్మతు చేసి ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్‌పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సమస్యను వెంటనే పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వ
ర్యంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ హెచ్చరించారు


Comments