ఘనంగా చిల్డ్రన్స్ పార్లమెంట్ వార్షిక దినోత్సవం.
గ్రామ సమస్యల పరిష్కారంలో చిన్నారుల చొరవ ప్రశంసనీయం.
అశ్వారావుపేట, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు):
ములకలపల్లిలో గుడ్ షెపర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ పార్లమెంట్ సభ్యుల వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పొగలపల్లి, తిమ్మంపేట, చోటిగూడెం, కంపగూడెం, ములకలపల్లి, మాదారం, జగన్నాధపురం, మొగరాలగుప్ప, మోటుగూడెం, గొల్లగూడెం గ్రామాలకు చెందిన చిల్డ్రన్స్ పార్లమెంట్ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలసభ మంత్రులు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం గ్రామసభల్లో పాల్గొని వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి సహకరించిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు. మూకమామిడి సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి, ములకలపల్లి సర్పంచ్ కోర్సా చంద్రలేఖ, పొగలపల్లి సర్పంచ్ మడకం రవి, మాదారం సర్పంచ్ సుజాత మాట్లాడుతూ చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో విద్యను అభ్యసించడంతో పాటు గ్రామ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం శ్రమించాలని సూచించారు. అలాగే పాఠశాలల్లో నిర్వహించే పేరెంట్–టీచర్ సమావేశాలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, తిమ్మంపేట ప్రధానోపాధ్యాయుడు శంకర్, సిస్టర్స్ ఉదయ, రీమాతదితరులు పాల్గొన్నారు.


Comments