మాదిగల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే మార్గం.
ఎస్సీ వర్గీకరణ ఫలాలు ప్రతి మాదిగ కుటుంబానికి చేరాలి: అడ్డూరి అనిల్ మాదిగ.
ఎల్కతుర్తి, జూలై 7 (తెలంగాణ ముచ్చట్లు):
మాదిగల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే మార్గమని, మూడు దశాబ్దాలకు పైగా సాగిన ఉద్యమ ఫలితంగా సాధించిన ఎస్సీ వర్గీకరణ ప్రయోజనాలు ప్రతి మాదిగ కుటుంబానికి అందేలా ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్ ఎల్కతుర్తి మండల కోఆర్డినేటర్ అడ్డూరి అనిల్ మాదిగ పిలుపునిచ్చారు.
మంగళవారం ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, అలాగే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి, అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా అడ్డూరి అనిల్ మాదిగ మాట్లాడుతూ, 32 సంవత్సరాల నిరంతర ఉద్యమం వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. ఉద్యమం ద్వారా లభించిన అవకాశాలను ప్రతి మాదిగ బిడ్డ సద్వినియోగం చేసుకుని విద్య, ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ముందుకు రావాలని సూచించారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని కొనియాడిన ఆయన, ఆరోగ్యశ్రీ పథకం, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ల పెంపు వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల వెనుక ఎమ్మార్పీఎస్ ఉద్యమాల పాత్ర ఉందని పేర్కొన్నారు.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే వరకు ఉద్యమం కొనసాగుతుందని, ఎస్సీ వర్గీకరణ సాధించిన ఐక్యతతోనే మరిన్ని హక్కులను కూడా సాధించుకోవచ్చని అన్నారు. యువత ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ సామాజిక న్యాయం సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు బొంకూరి కార్తీక్ మాదిగ, ఎల్కతుర్తి సర్పంచ్ మునిగడప లావణ్య–శేషు, చింతలపల్లి సర్పంచ్ బొంకూరి రజిత, ఇంద్రనగర్ సర్పంచ్ అంబాల రాజ్‌కుమార్, మాదిగ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు బొంకూరి వంశీ మాదిగ, సీనియర్ నాయకులు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Comments