రాష్ట్రానికే ఆదర్శంగా సత్తుపల్లిలో వనమహోత్సవ ర్యాలీ.
ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 15 వేల మందితో వినూత్న కార్యక్రమం.
సత్తుపల్లి, జూలై 3 (తెలంగాణ ముచ్చట్లు):
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సత్తుపల్లి పట్టణం శుక్రవారం హరిత సందేశంతో మార్మోగింది. ఆశా స్వచ్ఛంద సేవా
సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా సుమారు 15 వేల మందితో నిర్వహించిన భారీ వనమహోత్సవ ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. వేలాది మంది విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే వేదికపై చేరి పచ్చదన పరిరక్షణకు తమ మద్దతు ప్రకటించారు. జేవీఆర్ కళాశాల మైదానంలో ప్రారంభమైన ర్యాలీ పాత సెంటర్ వరకు ఉత్సాహభరితంగా సాగింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, జానపద కళాకారుల విన్యాసాలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పట్టణ వీధులన్నీ హరిత నినాదాలతో మార్మోగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ఇంత భారీ స్థాయిలో ప్రజలను భాగస్వాములను చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలమని సూచించారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ సామాజిక చైతన్య కార్యక్రమాలకు సత్తుపల్లి నియోజకవర్గం ఎప్పుడూ ముందుంటుందని, ఈ భారీ వనమహోత్సవ ర్యాలీ రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్, డీఎఫ్‌వో, ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.


Comments