గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.
పెద్దమందడి,జూన్20(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం సామూహిక అక్షరాభ్యాసం, గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నస్రీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అడ్డాకుల వెంకటేశివర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గురుకుల ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి సీట్లు సాధించిన విద్యార్థులు కే. మానస, ఎం. అక్షయ, ఏ. సతీష్, ఎం. మూర్తిలను వారి తల్లిదండ్రులతో కలిసి శాలువాలతో సన్మానించి అభినందించారు.సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యాబోధనతో పాటు పాఠ్య, సహ పాఠ్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.విద్యార్థుల కోసం నిర్మించిన మరుగుదొడ్లను సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాలలో తాగునీటి కోసం వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అడ్డాకుల వెంకటేశివర్లు మాట్లాడుతూ విద్యార్థులు చదువు, రచన, గణిత నైపుణ్యాలను పెంపొందించుకొని క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు.


Comments