బీజేపీ సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగం చేసిన రవీందర్ రావుకు ఘన నివాళి.
జమ్మికుంట టౌన్ జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండల మాజీ బీజేపీ అధ్యక్షుడు, స్వర్గీయ పోల్నెని రవీందర్ రావు వర్ధంతి సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, రవీందర్ రావు సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా కొలకాని రాజు, కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్, జీడి మల్లేష్, టంగుటూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ, 1997లో జమ్మికుంట మండల బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన రవీందర్ రావు పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. అయోధ్య రామమందిర ఉద్యమానికి ప్రజా మద్దతు కూడగట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజా ఉద్యమాలు నిర్వహించిన రవీందర్ రావును లక్ష్యంగా చేసుకుని నక్సలైట్లు బెదిరింపులకు పాల్పడ్డారని, పార్టీని వీడాలని హెచ్చరించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదని తెలిపారు. అనంతరం 1997 జూన్ 15 అర్థరాత్రి నక్సలైట్లు దారుణంగా హత్య చేశారని, ఆయనను భౌతికంగా దూరం చేసినా ఆశయాలను మాత్రం చెరపలేకపోయారని అన్నారు.
జమ్మికుంట గడ్డ నుంచి రవీందర్ రావుతో పాటు సమ్మిరెడ్డి వంటి నాయకులు దేశం కోసం బలిదానాలు చేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు బీజేపీ కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉందని పేర్కొన్నారు. రవీందర్ రావు త్యాగాలను స్మరించుకుంటూ పార్టీ కార్యకర్తలు ఆయన ఆశయ సాధనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్, జిల్లా, పట్టణ పదాధికారులు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments