ఒకరి రక్తదానం... మరొకరి ప్రాణదానం.
హుజూరాబాద్, జూన్ 14(తెలంగాణ ముచ్చట్లు ):
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. ఈ శిబిరాన్ని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు ప్రారంభించి రక్తదాన ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సుహాసిని మాట్లాడుతూ, రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం అనేక మంది ప్రాణాలను కాపాడుతుందని పేర్కొన్నారు. యువతతో పాటు ప్రతి ఆరోగ్యవంతుడైన వ్యక్తి సంవత్సరానికి కనీసం ఒకసారి అయినా రక్తదానం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. సమాజంలో మానవత్వాన్ని చాటే గొప్ప సేవల్లో రక్తదానం ఒకటని కొనియాడారు.
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రక్తదాతల సేవలు వైద్య రంగానికి ఎంతో విలువైనవని అన్నారు. రక్త నిల్వలు అందుబాటులో ఉంటే అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రమాద బాధితులు, గర్భిణీలు మరియు ఇతర రోగులకు సకాలంలో వైద్యం అందించవచ్చని తెలిపారు.
శిబిరానికి పెద్ద సంఖ్యలో యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు హాజరై రక్తదానం చేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ శిబిరం ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెంపొందించడంతో పాటు మానవ సేవా భావాన్ని చాటిచెప్పిందని పలువురు అభిప్రాయపడ్డారు.


Comments