హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీసుల పనితీరుకు సీపీ ప్రశంసల జల్లు.
జమ్మికుంట టౌన్ జూన్ 09 (తెలంగాణ ముచ్చట్లు):
వార్షిక తనిఖీల్లో భాగంగా గౌష్ ఆలం మంగళవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు, పెండింగ్ కేసులు, కార్యాలయ నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయానికి చేరుకున్న సీపీకి సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించగా, అనంతరం ఆయన కార్యాలయ ప్రాంగణంలో మొక్క నాటారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసింగ్‌లో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచాలని సూచించారు. సీసీటీఎన్ఎస్ 2.0, ఈ-సాక్ష్య వ్యవస్థల్లో కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను జూన్ 15లోగా నమోదు చేయాలని ఆదేశించారు. పాత కేసులతో పాటు కొత్తగా నమోదయ్యే కేసుల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు.
గత నెలలో కరీంనగర్‌లోని పీఎంజే నగల దుకాణంలో జరిగిన దారిదోపిడీ ఘటనను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ పరిధిలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. నగల దుకాణాలు, బ్యాంకులు, లాడ్జీలు, హోటళ్లలో భద్రతా ప్రమాణాలను సమీక్షించి, సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెప్పారు. భద్రతా లోపాలు ఉన్న యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు అందజేసినట్లు వెల్లడించారు.
నేరాల నియంత్రణలో భాగంగా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన కార్మికుల వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, లాడ్జీలలో తనిఖీలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు జాగిలాల సహాయంతో తనిఖీలు నిర్వహిస్తున్నామని, అనుమానితులపై పరీక్షలు చేసి నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం షీ లీడ్స్, స్నేహిత కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పనిచేయని సీసీ కెమెరాలను మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.
తనిఖీల అనంతరం హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీసుల పనితీరు, రికార్డుల నిర్వహణపై సీపీ గౌష్ ఆలం ప్రశంసలు కురిపిస్తూ "భేష్" అని అభినందించారు. క్షేత్రస్థాయిలో అన్ని ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాధవి, కరుణాకర్, రామకృష్ణ, వెంకట్, శ్రీనివాస్తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments