అతిపెద్ద మున్సిపాలిటీకి శాశ్వత తహశీల్దార్ ఎప్పుడు?.
జమ్మికుంట టౌన్ జూన్ 09 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహశీల్దార్ కార్యాలయంలో శాశ్వత తహశీల్దార్ (ఎమ్మార్వో), ఉప తహశీల్దార్ లేకపోవడంతో విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీల్లో ఒకటైన జమ్మికుంటలో కీలక అధికారులు లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం జమ్మికుంట తహశీల్దార్ కార్యాలయానికి ఇల్లంతకుంట తహశీల్దార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడంతో కార్యాలయ పనులు సకాలంలో పూర్తికావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో నియమితులైన అధికారులు కొద్ది కాలానికే పదోన్నతులు లేదా బదిలీలపై వెళ్లిపోవడంతో శాశ్వత అధికారి కొరత ఏర్పడింది.
కళాశాలల ప్రవేశాల సీజన్ ప్రారంభం కావడంతో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం వేలాది మంది విద్యార్థులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే సంతకాలు చేయాల్సిన అధికారి అందుబాటులో లేకపోవడంతో దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని విద్యార్థులు వాపోతున్నారు.
ప్రభుత్వ పథకాలు, విద్యా ప్రవేశాలు, ఉపకార వేతనాల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రైతులకు సంబంధించిన భూ రికార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, భూముల రిజిస్ట్రేషన్ తదితర పనులు కూడా ఆలస్యమవుతున్నాయని రైతులు చెబుతున్నారు.
కార్యాలయంలో ఉన్న ఇతర సిబ్బంది కూడా శాశ్వత అధికారి లేకపోవడంతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని, ప్రజలకు సరైన సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
జమ్మికుంట వంటి ప్రధాన కేంద్రానికి వెంటనే శాశ్వత తహశీల్దార్, ఉప తహశీల్దార్‌ను నియమించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, రైతులు, తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.


Comments