ప్రతి పేద బిడ్డకు నాణ్యమైన విద్యే ధ్యేయం.
రూ.3.25 కోట్లతో ఎల్కతుర్తి కేజీబీవీ నూతన భవనం ప్రారంభం.
ఎల్కతుర్తి, ఆగస్టు 10 (తెలంగాణ ముచ్చట్లు):
పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పేదల పక్షపాతిగా పనిచేస్తోందని తెలిపారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో రూ.3.25 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) నూతన భవనాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల డైట్ ఛార్జీలను 40 శాతం, వసతి గృహాల్లో చదువుతున్న బాలికల కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచినట్లు పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గానికి రూ.200 కోట్ల చొప్పున కేటాయించి సుమారు 3,500 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా మరెందరికో ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని అన్నారు. విద్య, వైద్యం పేదల జీవితాలకు రెండు కళ్ల వంటివని, ఈ రంగాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
కేజీబీవీ ప్రిన్సిపాల్ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రిల్స్, ప్రహరీ తదితర అవసరమైన పనులను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యకు అత్యధిక ప్రాధాన్యత : మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు నూతన భవనాలు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు, పదోన్నతులు, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
నాణ్యమైన విద్యే భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా నైపుణ్యాలు, వృత్తిపరమైన సామర్థ్యాలను పెంపొందించుకునేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
కేజీబీవీల్లో మెరుగైన వసతులు : కలెక్టర్
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ ఎల్కతుర్తి కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తికావడం సంతోషంగా ఉందన్నారు. నాబార్డు నిధులతో అదనపు మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.
జిల్లాలోని కేజీబీవీలను జూనియర్ కళాశాలల స్థాయికి అప్‌గ్రేడ్ చేయడంతో పాటు అదనపు తరగతి గదులు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నూతన యూనిఫాంలు, ట్రంక్ బాక్సులు, ఇతర అవసరమైన సామగ్రిని ఇప్పటికే అందజేశామని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రులు విద్యార్థినులకు బ్లాంకెట్లు, ట్రంక్ బాక్సులు, కార్పెట్లు, ఇతర సామగ్రిని అందజేశారు. నూతన భవనంలోని వసతులను పరిశీలించి విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రులు ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, డీఈఓ గిరిరాజ్ గౌడ్, కేజీబీవీ ప్రిన్సిపాల్ అనితాదేవి, వివిధ శాఖల అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Comments