ప్రైవేట్ పాఠశాలల ఫీజులకు కళ్లెం వేయాలి.
ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి: బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి జేకే.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 08 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రైవేట్ పాఠశాలలు తమ ఫీజుల వివరాలను తప్పనిసరిగా బహిరంగంగా ప్రకటించేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి జేకే అన్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలపై బీఆర్‌ఎస్‌వీ సంవత్సరాలుగా కొనసాగిస్తున్న నిరంతర పోరాటాలు, ప్రజాస్వామ్యబద్ధమైన శాంతియుత ఉద్యమాల ఫలితంగానే ఫీజుల పారదర్శకత దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తొలి అడుగుగా భావిస్తున్నామని తెలిపారు.
అయితే కేవలం ఫీజుల వివరాలను ప్రదర్శించడం మాత్రమే సరిపోదని, ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచకుండా ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కోసం భరించలేని స్థాయిలో ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితిని నివారించేందుకు తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేకంగా ‘ఫీజుల నియంత్రణ మరియు క్రమబద్ధీకరణ బిల్లు’ ప్రవేశపెట్టి చట్టం చేయాలని కోరారు.
విద్య హక్కు.. వ్యాపారం కాదు అని స్పష్టం చేసిన జేకే, విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారాన్ని మోపడం అన్యాయమన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల వసూళ్లలో పూర్తి పారదర్శకత ఉండాలని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫీజుల నియంత్రణకు సంబంధించి బీఆర్‌ఎస్‌వీ చేస్తున్న సూచనలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి అసెంబ్లీలో బలమైన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. విద్యా రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం మరింత ముందుకు సాగాలని సూచించారు.
దశాబ్దాలుగా సాగుతున్న ప్రజాస్వామ్య పోరాటాలు, సమిష్టి గొంతుకలు, శాంతియుత ఉద్యమాలు ప్రభుత్వాలపై ప్రభావం చూపి అర్థవంతమైన మార్పును తీసుకురాగలవని ఈ పరిణామం మరోసారి నిరూపించిందన్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చే వరకు, అధిక ఫీజుల భారం తగ్గే వరకు బీఆర్‌ఎస్‌వీ పోరాటం కొనసాగుతుందని జేకే స్పష్టం చేశారు.


Comments